ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జిల్లాలో గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో చిన్నారుల కోసం నిర్వహిస్తున్న వేసవి శిబిరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సీతంపేట గ్రంథాలయంలో బుధవారం మ్యాజిక్‌షోను నిర్వహించారు. తొలుత ఎ.కృష్ణశర్మ కథల ద్వారా పిల్లలను చైతన్య పరిచారు. పంచతంత్రం, కొంగ బావ కథలను చెప్పారు. పిచ్చుక రాంబాబు తెలుగు పద్యాలు నేర్పించారు. జెవివి నాయకులు మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సిహెచ్.శ్రీరాములు మ్యాజిక్‌షోను నిర్వహించారు. సమాజంలో జరిగే మూఢనమ్మకాలను ఎలా పోగొట్టుకోవాలి అనే దానిపై మ్యాజిక్ చేసి చూపించారు. అరచేతిలో కర్పూరం వేగించడం, టెంకాయతో మ్యాజిక్ గ్లాసులను గాలిలో ఎగరవేయడం, వాటిలో ఉన్న రహస్యాలను తెలిపి పిల్లలతో చేయించారు. అనంతరం శ్రీరాములును సత్కరించారు. అలాగే డ్రాయింగ్, క్రాఫ్ట్ టీచర్ ఐ.రాజ్‌కుమార్ చిత్రలేఖనంలో రంగులను ఎలా వాడాలో నేర్పించారు. పేపర్లతో బొమ్మల తయారీ నేర్పించారు. సత్యనారాయణమూర్తి వేదిక్ మ్యాథమెటిక్స్ చెప్పారు. గ్రంథాలయ అధికారి కె.సుగుణకుమారి మాట్లాడుతూ జూన్ 11వరకూ ఈ శిక్షణా తరగతులు జరుగుతాయన్నారు. గ్రంథాలయ సిబ్బంది ఎం.వీరలింగం, డి.రాజు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ స్టూడెంట్స్ కార్యక్రమం లో సహాయ సహకారాలు అందించారు.
కడియం శాఖా గ్రంథంలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం బుధవారం నాటికి 17వ రోజుకు చేరింది. సాధు జనార్థనరావు మెమోరియల్ సొసైటీ నుంచి ఎస్‌వి.కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. కాలం, పని, సంస్కృతి, పోలిక, విజయం, సమస్య, పెద్ద వాళ్ల పట్ల విధేయత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ శ్రీదేవి నిర్మల, విద్యార్థులు పాల్గొన్నారు.
హామీలు నెరవేర్చాలని జెసికి వినతి
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జెసి తేజ్ భరత్‌కు కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొర్ల మాణిక్యం ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం అందించారు. బుధవారం జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ప్రారంభోత్సవ నిమిత్తం కొవ్వూరు విచ్చేసిన సిఎం జగన్ కలిసి వినతి పత్రం అందించేందుకు ప్రయత్నించారు. సిఎం వినతిపత్రం అందుకోవాలని జెసిని ఆదేశించడంతో కాకినాడ జిల్లా అధ్యక్షుడు షేక్ రబ్బానీ గౌస్, ఉపాధ్యక్షుడు మూర్తిలతో కలిసి వినతి పత్రం అందజేశారు. 23 ఏళ్లుగా పని చేస్తున్న తమ సర్వీసు రెగ్యులరైజ్ చేసి న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే నాలుగు సంవత్సరాలు కావొస్తుందని కనీసం ఇప్పటికైనా రెగ్యులరైజ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తెలంగాణలో కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేశారన్నారు.










