ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నిబంధనల కొరడా పొంచి ఉంది. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న విధానాలు రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఇబ్బందులకు అద్దం పడుతున్నాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పేరుతో ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌ను గత ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చిన విషయం విధితమే. అయితే గత పరిస్థిలకు భిన్నంగా కొన్ని నిబంధనలు కూడా విధించింది. కూలీలకు మౌలిక సదుపాయాల కల్పన, సమ్మర్ అలవెన్సులకు ఇప్పటికే మంగళం పలికింది. గ్రామపంచాయతీ స్థాయిలో తీర్మానాలు చేసుకోవడం, ఎక్కడ ఏ అవసరం ఉంటే పనులు చేపట్టడం కొన్నేళ్లుగా పరిపాటిగా వస్తోంది. ఉదాహరణకు చెరువుల్లో పూడికలు తీయడం, కాలువల మరమ్మతులు, ఆధునికీకరణ ఎలాంటి పనులైనా చేపట్టి ఉపాధి హామీ కూలీలకు సొమ్ములు మంజూరు చేస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివద్ధిశాఖ ఉపాధి హామీ కింద ఏ పనులు చేపట్టాలో సూచిస్తూ జాబితాను రాష్ట్రాలకు అక్కడి నుంచి జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థకు విధి విధానాలు అందజేసిందని తెలుస్తోంది.
ప్రతి పనికీ జియో ట్యాగింగ్ చేసిన తర్వాతే పనులు
జిల్లాలో 1.89 లక్షల జాబ్ కార్డుదారులు ఉన్నారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 59 లక్షల పని దినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా తీసుకున్నారు. ప్రతి పనికీ జియోట్యాగింగ్ చేసిన తర్వాతే పనులను ప్రారంభించాలనే నిబంధనలు ఉన్నాయి. దీని ఆధారంగానే నేరుగా బ్యాంకు ఖాతాలో పనులకు సంబంధించిన బిల్లులను జమ చేస్తున్నారు. ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్ అమలుతో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని పనులు చేపడుతున్నారు. గతంలో జిల్లాను యూనిట్‌గా తీసుకుని మెటీరియల్ పనులు చేసేవారు. ఎన్‌ఐసి ద్వారా గ్రామ యూనిట్‌గా పనులు చేపడితే కూలీలకు పని దినాలు పెరిగాయని చెబుతున్నారు. మొత్తం మీద నూతన విధానం గోరుచుట్టుపై రోకలి పోటులా మారనుందని స్పష్టమవుతోంది.
పొంచి ఉన్న నిబంధనల కొరడా
ఉపాధి హామీ పనులు గ్రామాల్లో నీటిపారుదల, వ్యవసాయ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలతో పాటు పలు ప్రభుత్వ శాఖల ఆధీనంలో ఉన్న పనులు కూడా చేపట్టి ఉపాధి హామీ కూలీలకు కూలి డబ్బు ఇస్తున్నారు. ఇతర శాఖల పనులు ఏమి చేపట్టినా ఆ శాఖలనుంచి ఎలాంటి అభ్యంతరం లేనట్టు ఎన్‌ఒసి ధ్రువీకరణపత్రాలు, అంచనాలు తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. అలా ఎన్‌ఒసి తీసుకుంటేనే ఆశాఖ పని ఉపాధి హామీ కింద చేపట్టాలని ఆదేశాలున్నాయి. ఈ నిబంధనల కారణంగా గ్రామస్థాయిలో ఏ పనులు చేపట్టాలన్నా ఇతర సంబంధిత శాఖల పనులు అనుమతి ఉంటేనే సాధ్యమవుతుంది. ఇతర శాఖల నుంచి అనుమతులు తీసుకోవడమనేది అంత సులువుగా సాధ్యం కాదు. ఈ నిబంధనలపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో తాత్కాలికంగా కొంత సడలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పనులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో శాఖల అధిపతుల నుంచి ఎన్‌ఓసి తప్పనిసరి చేసినట్లయితే ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ పథకంలో పారదర్శకత పేరుతో అమలు చేస్తున్న ఒకొక్క విధానం పధకం లక్ష్యానికి తూట్లుపొడిచేలా ఉన్నాయని స్పష్టమవుతోంది.










