Jun 01,2023 10:31

సమావేశంలో చేనేత సమస్యలపై మాట్లాడుతున్న చేనేత కార్మికుడు లోకేష్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : ప్రభుత్వాల నుంచి సరైన సహకారం లేకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయి ఆ వృత్తికే దూరం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో 'సందర్భం సమాలోచన'లో చేనేత కార్మికుల సమస్యలపై నిర్వహించారు. ఈ సమావేశానికి ధర్మవరం నుంచి వచ్చిన పలువురు చేనేత కార్మికులు వారి సమస్యలను తెలియజేశారు. చేనేత కార్మికుడు లోకేష్‌ మాట్లాడుతూ గతంలో ఏనాడూ చూడనంత బాధలు చేనేత కార్మికులు ఈరోజుల్లో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిలో ఆదాయం లేకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోలేక చేనేత కార్మికుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. నాలుగు నెలలుగా చేనేతలో ఎటువంటి ఆదాయం లేదన్నారు. పవర్‌లూమ్స్‌ను నియంత్రించి చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. ముడిసరుకు ధరలను నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్కో మాజీ ఎండి రమణ మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకునే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. చేనేత రక్షణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌, మానవ హక్కుల వేదిక నాయకులు చంద్రశేఖర్‌, బాషా, రైతుసంఘం నాయకులు శివారెడ్డి, జెవివి నాయకులు గాంగే నాయక్‌, ప్రసూన, లక్ష్మీనారాయణ, రెడ్స్‌ భానుజా, సమావేశం సమన్వయకర్తలు నిస్సార్‌, బాబుద్దీన్‌, చేనేత కార్మికులు లోకేష్‌, గంగాధర్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.