Dec 22,2022 22:35

విద్యార్థులకు ట్యాబులు పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి

స్మార్ట్‌ మీటర్ల పై అసత్య ప్రచారాలు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ప్రజాశక్తి-పుంగనూరు:

స్మార్ట్‌ మీటర్ల విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్న సంస్థలపై రాష్ట్ర, విద్యుత్‌, అటవీ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పుంగనూరు మండలం పల్లెబాట కార్యక్రమాన్ని గురువారం ఎంపీపీ అకిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ స్మార్ట్‌ మీటర్లు పై కొన్ని పత్రిక యాజమాన్యాలు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. విషప్రచారం చేసేవారు టెండర్లు దాఖలు చేయొచ్చని చురకలు అంటించారు. స్మార్ట్‌మీటర్లలో అనేక సదుపాయాలు ఉండటంతో సాధారణంగానే ధర ఎక్కువగా ఉంటుందన్నారు. వాటిని మామూలు మీటర్లతో పోల్చి ధర ఎక్కువ అని ప్రచారం చేస్తున్నారని, ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి ప్రభుత్వం ఇవి మంజూరు చేయలేదు టెండర్లు లేకుండా ఎవరిని పిలిచి పనులు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా కూడా ఈటెండర్లలో పాల్గొనవచ్చు అని చెప్పారు. ప్రస్తుతం ఆర్డిఎస్‌ఎస్‌ కింద ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ ఈ మీటర్లు బిగిస్తున్నామని తెలిపారు.
కేంద్రం నిర్ణయించిన సూచనల మేరకు ఆ టెండర్లు పిలిచామన్నారు. ఇప్పటికే ఈ కాంట్రాక్ట్‌ షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ వర్క్స్‌కు అప్పగించామని వార్త రాశారని, అలాంటిది ఎది లేకుండా ఇలాంటి అసత్య వార్తలు రాశారని, త్వరలో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేవలం జవాబుదారీతనం తీసుకుని రావడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని, వాటికి ఇంకా టెండర్లు పిలవలేదని, త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతిపల్లెలో పర్యటించనున్న రాష్ట్ర విద్యుత్‌, అటవీ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిపల్లెలో ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతున్నదన్నారు. తమ దష్టికి వచ్చిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
మొదటిరోజు కుమ్మరగుంట, సింగిరిగుంట, మేలుందొడ్డి, వనమలదిన్నే, మాగాండ్లపల్లి పంచాయతీల పరిధిలో పర్యటన నిర్వహించారు.
పుంగనూరు నియోజకవర్గంల పంచాయతీల పరిధిలోని మొత్తం 24 పల్లెల్లో పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకుని వారికి ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈపర్యటనలో భాగంగా పుంగనూరు నియోజకవర్గం వనమలదిన్నేలోని జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు ట్యాబ్‌ పంపిణీ చేశారు. అలాగే మండలంలో ఉన్న 17 ఉన్నతపాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 1160 మంది విద్యార్థులు, 148 మంది ఉపాధ్యాయులకు ట్యాబులు పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని మాగాండ్లపల్లిలో పలు భవనాలను ప్రారంభించారు. మాగాండ్లపల్లిలో రూ.40లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం, రూ.17.5లక్షలతో నిర్మించిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, రూ.21.80లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, జడ్పీ చైర్మన్‌ వాసు, జడ్పిటిసి సభ్యులు జ్ఞానప్రసూన చంద్రారెడ్డి యాదవ్‌, ముడా చైర్మన్‌ వెంకట యాదవ్‌, రాష్ట్ర సాంస్కృతిక శాఖ విభాగపు చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజురెడ్డి పాల్గొన్నారు.