ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభా వేదిక వద్ద పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత తెలిపారు. మంగళవారం స్థానిక సత్యవతి నగర్‌లోని సభా వేదిక వద్ద మంత్రి తానేటి వనిత, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎంపి మార్గాని భరత్ రామ్, కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కొవ్వూరు పురపాలక సంఘం చైర్‌పర్సన్ బావన రత్నకుమారి తదితరులతో కలిసి సభా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను కలెక్టర్ కె.మాధవీలత తెలియజేస్తూ, జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద రూ.30 కోట్లు తల్లుల ఖాతాకు జమ చేసినట్టు చెప్పారు. మొత్తం 30 గ్యాలరీలు ఏర్పాటు చేశామని, 22 వేల మందికి అనుగుణంగా కుర్చీలు ఏర్పాట్లు చేశామన్నారు. వేసవి దష్ట్యా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, అల్పాహారం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లులు హాజరు కానున్న దష్ట్యా అందుకు తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థుల కోసం ఆయా కళాశాలల్లో, వివిధ గ్రామాల నుంచి వచ్చే వారి కోసం గ్రామాల్లో బస్సులు ఏర్పాటు చేశామన్నారు. బస్సుల్లో తాగునీరు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు మాధవీలత తెలిపారు.
సిఎం పర్యటనను విజయవంతం చేయాలి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పట్టణంలో రాష్ట్ర స్థాయి 'జగనన్న విద్యా దీవెన' కార్యక్రమంలో పాల్గొంటారని హోమ్ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. మంగళవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సిఎం పర్యటన ఏర్పాట్లపై మాట్లాడారు. సిఎం వైఎస్.జగన్ విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. పేదరికం చదువుకు అడ్డు కాకూడదనే లక్ష్యంతో అర్హులైన పేద విద్యార్థులందరికీ విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందిస్తూ ఉన్నత చదువు చదివిస్తున్నారన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌కు గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1700 కోట్లు వైసిపి ప్రభుత్వమే చెల్లించిందని పేర్కొన్నారు. సిఎం బడుగు బలహీన వర్గాలకు చెందిన లక్షల కుటుంబాల్లోని పిల్లలకు విద్యా దీవెన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో సిఎం కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటనకు రానున్నారని చెప్పారు.










