ప్రజాశక్తి-రాజమహేంద్రవరం దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రెజ్లర్ల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, ఇందుకు కారకుడైన బ్రిజ్ భూషణ్‌ను తక్షణం తొలగించాలని ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. గురువారం భోజన విరామ సమయంలో ఇన్నీసుపేటలోని ఎల్‌ఐసి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం మహిళా కన్వీనర్ శిరీష మాట్లాడుతూ బిజెపి ఎంపీగా ఉన్న బ్రిజ్ భూషణ్‌ను తక్షణమే ఇండియన్ రెజ్లర్ ఫెడరేషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అందరూ ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు. నాలుగు నెలలుగా మహిళలు చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం తరపున సంఘీభావం తెలుపుతున్నామని అఖిల భారత ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు పి.సతీష్ తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల ఉద్యోగుల సంఘం నాయకులు గుబ్బల రాంబాబు, ఎం.కోదండరామ్, పి.సుబ్బారావు, సత్యదేవ, శ్రీను, రమేష్, రాజు, రామకష్ణ, విజయ దుర్గ శ్రీదేవి గాయత్రి తదితరులు పాల్గొన్నారు.










