రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
జిల్లా యంత్రాంగం తుపాను సమయంలో ముందుగానే అప్రమత్తంగా ఉండడంతో చాలావరకు నష్టాన్ని నివారించగలిగామని, అదేవిధంగా తుఫాన్ తర్వాత ప్రభావిత గ్రామాలలో అత్యద్భుతంగా పనిచేయడం జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్త మయ్యిందని, అదేవిధంగా తుపాను అనంతరం పంట నష్టాన్ని అంచనా వేయడంలో రైతు భరోసా కేంద్రాల సిబ్బంది తీరు అత్యద్భుతంగా ఉందని గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. ఏ పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఈ కేవైసీ, ఈ క్రాప్ బుకింగ్ చేసుకోని వారికీ తగిన న్యాయం జరుగుతుందని అన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు బాధ్యతతో పనిచేయడం వల్ల కొంతవరకు తుపాను నష్టాన్ని తగ్గించగలిగామని, సోమవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. ఇప్పటికీ ఎవరైనా ఆర్బికే పరిధిలో ఉన్న రైతులు పంట నష్టాన్ని నమోదు చేసుకోకపోతే రైతు భరోసా కేంద్రాలలో ఉన్న వ్యవసాయ సలహా మండలి సభ్యులకు తెలియజేయాలని లేదా ఉద్యోగులకు తెలియ జేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి 80శాతం సబ్సిడీతో జర్మినేషన్ చేసిన విత్తనాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఆర్‌బికే వ్యవస్థ అత్యద్భుతంగా పనిచేయడంతో రైతులకు చాలా ఇబ్బందులు తొలగాయని, పంట నష్టం నమోదుకు సకాలంలో చేయగలిగారని అన్నారు. విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్ తర్వాత దెబ్బతిన్న ట్రాన్స్ ఫార్మర్లను రీప్లేస్ చేయడం జరిగిం దని, ఇంకా కొన్ని పోల్స్ మిగిలి ఉన్నా యని, త్వరలో వాటిని మార్చడం జరుగు తుందని వివరించారు. ఉద్యాన వన శాఖ ద్వారా మామిడి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ అవగాహన తరగతుల వల్ల రాబోవు కాలానికి మామిడిలో మంచి ఉత్పత్తులు సాధించేందుకు అవకాశం ఉంటుందని, అదేవిధంగా ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ అవగాహనలో రైతులకు వివరించడం జరుగుతుందని జిల్లా ఉద్యానవనాధికారి మధుసూదన్ రెడ్డి అన్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేసుకున్న వెంటనే ఇవ్వడం జరుగుతుందని, ఎరువులు సిద్ధంగా ఉంచడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకష్ణ అన్నారు. ఈ సమావేశంలో సిరికల్చర్ అధికారిణి శోభారాణి, లీడ్ బ్యాంకు మేనేజర్ శేషగిరిరావు పాల్గొన్నారు.










