ప్రజాశక్తి - ఉండ్రాజవరం : మండల కేంద్రం ఉండ్రాజవరం ఉన్నత పాఠశాలలో ప్లస్ టు గా ఏర్పాటు చేసిన మహిళా కళాశాలలో తమ పిల్లలను చేర్పించమని విద్యార్థినిల తల్లిదండ్రులకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఉండ్రాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారణాసి విశ్వప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మండలంలోని అనేక గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ, బుధవారం తాడిపర్రు లో ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినిలు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారని, అదే స్ఫూర్తిగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహిళా కళాశాలలో ఇంటర్మీడియట్ లో చేర్పించేలా విద్యార్థినిల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీసీ, సీఈసీ రెండు గ్రూపులతో, పూర్తిస్థాయిలో అధ్యాపకులు, తరగతి గదులు, అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తల్లిదండ్రులకు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో చివటం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు బి సుబ్బారావు, కే రాంప్రసాద్, అహుజా తదితరులు పాల్గొన్నారు.










