May 24,2023 23:15

నమూనా చెక్కు అందిస్తున్న సిఎం జగన్‌

3వ విడత విద్యాదీవెనలో సభలో సిఎం జగన్‌
కొవ్వూరులో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
'మీ ఇంట్లో మీకు మంచి జరిగితే.. మీ జగనన్నకు తోడుగా మీరే సైనికులా కదలి రండి.. నా బలం మీరే... నా నమ్మకం మీరే..' అని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. రాబోయే రోజుల్లో అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాననన్నారు. కొవ్వూరు వేదికగా విద్యాదీవెన ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. సిఎం జగన్‌ హాజరై 9.95లక్షల మంది విద్యార్థులకు రూ.703 కోట్లు వారి తల్లుల బ్యాంకు ఖాతకు బటన్‌ నొక్కి జమ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కొవ్వూరు నియోజకవర్గానికి వరాలజల్లు కురిపించారు. తన చెల్లి, హోం మంత్రి వనిత కోరిన విధంగా కొవ్వూరుకు డిగ్రీ కాలేజీ మంజూరు చేశామన్నారు. భవనాల కోసం రూ.30 కోట్లనూ మంజూరు చేస్తున్నామని చెప్పారు. మూడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల మరమ్మతులు, మూడు అంబేద్కర్‌ భవనాలు, ఎస్‌సి కమ్యూనిటీ హాల్‌, కాపు భవనం, షాధీ ఖానాతో పాటు కొవ్వాడ కెనాల్‌పై కల్వర్టులను సైతం అడిగింది. వాటన్నింటీనీ మంజూరు చేస్తున్నానని తెలిపారు. పేదలందరికీ నాణ్యమైన విద్యను అందించడమే తమ ధ్యేయమన్నారు.
ఈ సభలో తొలుత తానేటి వనతి మాట్లాడారు. విద్యా రంగంలో సిఎం జగన్‌ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి చరిత్ర సృష్టించారన్నారు. జగనన్న నాయకత్వంలో అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. చిన్నారులకు చదువే ముఖ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేశారన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులు ఈ ఏడాది స్టేట్‌ ర్యాంక్స్‌ సాధించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపారం చేస్తే తమ ప్రభుత్వం విద్యను పేదవాడి హక్కుగా మార్చిందన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం పొందుతున్న విద్యార్థులు, తల్లితండ్రుల తరపున ధన్యావాదాలు తెలిపారు. ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని, ఉపాధి అవకాశాలు కోసం ఎదురు చూడకుండా ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేణు, బొత్స సత్యనారాయణ, ఎం.నాగార్జున, కొట్టుసత్యనారాయణ, శాసన మండలి చైర్మన్‌ కె.మోషేన్‌రాజు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జి.జయలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకురాలు విజరుకృష్ణన్‌, ఎంపీలు మిథున్‌ రెడ్డి, మార్గాని భరత్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌, ఎంఎల్‌ఎలు చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి రాజా, శ్రీనివాసరావు, తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, జడ్‌పి చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, స్మార్ట్‌ సిటీ చైర్మన్‌ చందన నాగేశ్వర్‌, డిసిసిబి చైర్మన్‌ ఆకుల వీర్రాజు, రుడా చైర్మన్‌ మేడపాటి షర్మిలరెడ్డి, కలెక్టర్‌ కె.మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
తొలిసారి కొవ్వూరు నియోజక వర్గంకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం లభించింది. హెలిప్యాడ్‌ వద్ద హోం మంత్రి తానేటి వనిత, జిల్లా ఇంఛార్జి మంత్రి వేణు, కలెక్టర్‌ కె.మాధవీలత, ఎస్‌పి సిహెచ్‌.సుధీర్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్‌ షో నిర్వహించారు. దారి పొడవునా ప్రజలు పూలు జల్లుతూ స్వాగతం పలికారు. జగన్‌ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సభా కార్యక్రమాలు అనంతరం హెలిప్యాడ్‌ చేరుకున్న ముఖ్యమంత్రి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయనకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.