కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలి
సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు
ప్రజాశక్తి - చిత్తూర్ అర్బన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు అన్నారు. శుక్రవారం చిత్తూరులో జిల్లాస్థాయి సమావేశం జరిగింది. జిల్లా నాయకులు కె.సురేంద్రన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలపై దాడి చేయడం, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం దుర్మార్గమన్నారు. కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉందన్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కార్మికులు పోరాటాలు చేస్తుంటే వాటిని ఉక్కుపాదంతో అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసిందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించకుండా దేశ సంపదను గుత్త పెట్టుబడిదారులైన అదానీ, అంబానీ లకు అప్పగించే పనిలో ఉందన్నారు. గుజరాత్ మోడల్ అనే పేరుతో దేశం మొత్తం అమలు చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను అన్ని రకాల సంస్థలను అధికారికంగా అమలు చేయడానికి పూనుకోవడం దారుణం అన్నారు. దీంతో దేశంలో మత ఘర్షణలకు దారితీస్తోందన్నారు. దేశాన్ని గుత్త పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టేలా బిజెపి విధానాలు ఉన్నాయన్నారు. వీటిని తిప్పి కొట్టాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సీపీఎం బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. వర్షాలు కారణంగా ముందుగా చర్యలు చేపట్టడంలో అధికారులు మంచి ప్రయత్నాలు చేసినప్పటికీ నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం సహాయం అందించాలని డిమాండ్ చేశారు. త్వరలో రాబోయే తుపానును ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు ఓబుల్ రాజు, భువనేశ్వరి, గిరిధర్‌గుప్తా, చైతన్య, ఈశ్వరయ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.










