కార్మిక సమస్యలపై సమరశీల పోరాటాలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
కార్మిక సమస్యలపై సమరశీల పోరాటాలు సిఐటియు చిత్తూరు జిల్లా 8వ మహాసభ పిలుపునిచ్చారు. చిత్తూరుజిల్లా సిఐటియు 8వ మహాసభలు సోమవారం జిల్లా కేంద్రంమైన చిత్తూరులో పోరాటస్ఫూర్తితో ప్రారంభమైయ్యాయి. స్థానిక రైల్వేస్టేషన్ నుంచి ఎర్రజెండాలతో గాంధీరోడ్డు మీదుగా కార్మికులు భారీర్యాలీ నిర్వహించారు. ముందు వరసలో ఎనిమిది జెండాలతో మహిళలు నడవగా అంగన్వాడీ, ఆశా, సంఘమిత్ర, హమాలీ, పవర్‌ల్యూమ్, మిడేమీల్స్ కార్మికులు ఎర్రజెండాలను చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక రైల్వేస్టేషన్ నుంచి రెవెన్యూ అసోషియేషన్‌భవన్ వరకు సాగిన భారీ ర్యాలీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరశిస్తూ నినాదాలు చేశారు. గత మహాసభ నుంచి 8వమహాసభ కాలంలో మృతిచెందిన అమర వీరులకు నివాళ్ళు అర్పించారు.
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళిముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభ ఉపన్యాసం చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లాలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోగా కార్మికులు పోరాటాలను ఉక్కుపాదం తరచడానికి ప్రయత్నాలు చేయడం దారుణం అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పెద్దఎత్తున పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. అనేక రకాల సమస్యలపై సమశీల పోరాటాలు నడపడం జరిగిందన్నారు. కార్మికుల సమస్యలపై పెద్దఎత్తున పోరాటం జరిగిందని పోరాట ఫలితంగా కూలిరేట్లు పెంచడం జరిగిందన్నారు. స్కీంవర్కర్ల వేధింపులపై సిఐటియు నిరంతరం పోరాటం చేస్తున్నదని తెలిపారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యాక్షులు అజరుకుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలో మార్పులు తీసుకొచ్చి పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అదానిప్రదేశ్ మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసవేతనాల కోసం పోరాడుతుంటే రానున్న రోజుల్లో ఐదు, ఆరు నెలలకు మించి కార్మికుల పనిచేసేలా కొత్తగా తీసుకొచ్చిన కార్మికచట్టాల్లో మార్పులు తీసుకొచ్చారని ఈచట్టాల ఆమోదానికి మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఆమోదం తెలపడం సిగ్గుచేటన్నారు. ఈ మహాసభల్లో ఐదు రకాల సమస్యలపై తీర్మానాలు చేయడం జరిగింది. స్కీం వర్కర్లపై వేధింపులు మానుకోవాలని కార్మికులకు కూలి రేట్లు పెంచాలని జిల్లా పారిశ్రామిక అభివద్ధి కోసం కషి చేయాలని చింతపండు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, గార్మెంట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని తీర్మానం చేశారు. ఈ మహాసభల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు అజరు కుమార్ జిల్లా
ప్రధాన కార్యదర్శి చైతన్య సిఐటియు జిల్లా నాయకులు సురేంద్ర, షకిల, మమత, గిరిధర్ గుప్తా, సుజిని, భువనేశ్వరిలతో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మిక నాయకులు, కార్మికులు, స్కీమ్ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










