ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని గవ్వల వీధికి చెందిన శతాధిక వృద్ధుడు గవ్వల పుల్లన్న(104) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది కాలం క్రితం కొడుకులు కూతుళ్లు మనవళ్లు ముని మనవండ్లతో కలిసి గవ్వల పుల్లన్న 104వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. 104 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు ఆయన పనులు ఆయనే చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ నార్పల మండలంలోనే అత్యధిక వయస్సు కలిగిన వ్యక్తిగా పుల్లన్న ఉండేవారు. గురువారం ఆయన మరణించడంతో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి స్వాతిలత దంపతులు పుల్లన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. మండలానికి చెందిన పలువురు పుల్లన్న మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.










