May 24,2023 00:22

ప్రజాశక్తి-పెరవలి మండలంలోని అన్నవరప్పాడులో మంగళవారం రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. గ్రామంలో ఉన్న రెండు రైస్‌ మిల్లుల్లో ఐదు గ్రామాల నుంచి ధాన్యం దిగుమతులు చేసుకోకుండా 100 కిలోమీటర్ల దూరంలో అనపర్తిలో ఉన్న రైస్‌ మిల్లులకు ఆదివారం నుంచి ట్రాక్‌ షీట్‌ ఇవ్వటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న రైతులు, కౌలు రైతుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం రైతులు వద్ద నుండి బస్తా 75 కేజీల బదులు 85 కేజీలు అదనంగా 10 కేజీలు నూక శాతం పేరుతో తీసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్‌ మిల్లుల చుట్టూ ఉన్న ఐదు గ్రామాల రైతుల వద్ద ధాన్యం తీసుకోకుండా ఇతర ప్రాంతాలకు తరలించడంతో రైతులకు అదనంగా భారం పడు తోందన్నారు. గిట్టు బాటు ధర లేక ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అను కూలించక ఇబ్బందులు పడుతున్న రైతులను పట్టించుకునే నాధుడు లేడని, ఇంత జరుగుతున్నా స్థానిక ఎంఎల్‌ఎ రైతుల గోడు వినిపించుకున్న దాఖలాలు లేవని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల రైతుల పండించిన ధాన్యాన్ని ఇక్కడ రైస్‌ మిల్లులకు తరలించే విధంగా తగు ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు పి.కాళీప్రసాద్‌, రంకినీడి గంగాధర్‌, పంతం కపాకర్‌, పంతం నాగరాజు, ఆకుల సుబ్బారాయుడు, గుర్రాల శ్రీనివాస్‌, ఆకుల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అన్నవరప్పాడు, మల్లేశ్వరం, కడింపాడు, ఖండవల్లి, పిట్టలవేమవరం, దొంగరావిపాలెం తదితర గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.