ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో పది లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. గతంలో భూసార పరీక్షలకు అత్యధిక ప్రాధాన్యం లభించడంతో రైతులు భూమిలో ఏ పోషకాలు ఎంత ఉన్నదీ తెలుసుకొని ఎరువులు వాడేవారు. నేలలో పోషకాల లభ్యత తెలుసుకొనేందుకు భూసార పరీక్షలు నిర్వహించాలి. వాటి ఆధారంగా ఎరువులు, రసాయనాలను ఎలా వాడాలో అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు వాపోతున్నారు. సాధారణంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నమూనాలను సేకరించి భూ సారాన్ని పరీక్షిస్తారు. ఇలా పొలాల్లో ఏడాదికి ఒకసారైనా మట్టి పరీక్షలు నిర్వహించి భూమికి అవసరమైన పోషకాలు అందిస్తే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశముంటుంది. 2019లో ఉమ్మడి జిల్లాలో 62 గ్రామాల్లో 22,368 నమూనాలను సేకరించారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి వ్యవసాయ శాఖ మట్టి పరీక్షలకు మంగళం పాడింది. రైతులు ఆర్బికేలకు నమూనాలను తీసుకెళ్తేనే పరీక్షలు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు 6 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర వ్యవ సాయ పంటలు, 4.25 లక్షల ఎకరాల్లో కొబ్బరి, జీడిమామిడి, ఆయిల్ పామ్, మామిడి, అరటి, కర్రపెండలం, కాయగూరలు, పూలు, పసుపు, బొప్పాయి తదితర ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. విత్తనాల కొనుగోలు నుంచి పంట చేతికొచ్చే వరకూ అన్నదాతలు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో భూమికి పోషకాలు అందించే విధంగా వ్యవసాయ శాఖ సన్నద్ధం చేయాల్సి ఉంది.
కానరాని పరీక్షలు
భూసార పరీక్షలతో రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి అధికారులు రైతుల పొలాల వద్దకు వెళ్లి మట్టి నమూనాలను సేకరించాల్సి ఉంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు పరీక్షలు మరిచారు. ఇప్పుడు ఆర్‌బికెల ద్వారా నిర్వహిస్తు న్నామని చెబుతున్నా అరకొరగానే సాగుతున్నాయి. రైతులకు అవసరం ఉండి నమూనాలను తీసుకెళ్తేనే పరీక్షలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అవి కూడా కొన్ని చోట్ల మాత్రమే నిర్వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షలకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నా సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పరీక్షలకు కావాల్సిన రసాయనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచలేదు. దీంతో రైతులు ఆర్‌బికెలకు వెళుతున్నా నిరాశ తప్పడం లేదు.
పెరుగుతున్న పెట్టుబడులు
భూముల మట్టి తత్వాన్ని బట్టి ఎరువులను ఎంపిక చేసుకుని, వ్యవసాయ నిపుణుల సలహాల మేరకు రసాయనాలను వాడితే రైతులకు మేలు జరుగుతుంది. అయితే ఆ పరిస్థితి క్షేత్రస్థాయిలో లేదు. దీంతో ఎంత ఎక్కువగా రసాయనాలు వాడితే దిగుబడి అంత గణనీయంగా వస్తుందన్న అపోహలతో పలువురు రైతులు పరిమితికి మించి ఎరువులు, రసాయనాలు వాడుతున్నారు. విత్తనం నాటిన నాటి నుంచి దిగుబడి వచ్చే వరకు వివిధ దశల్లో అధిక ఎరువులు, పురుగుల మందులను వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతుండగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.










