ప్రజాశక్తి - ఉండ్రాజవరం : ఒక్కసారి వాడి పడవేసే క్యారీ ప్యాక్ ల వంటి ప్లాస్టిక్ పరికరాలతో పర్యావరణానికి తీరని ముప్పు అని ఈవోపీఆర్డి ముత్యం వీరాస్వామి నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న పర్యావరణ అవగాహన కార్యక్రమం మేరి లైఫ్ లో భాగంగా శుక్రవారం ఉండ్రాజవరం గ్రామ సచివాలయం నుండి పంచాయతీ కార్యదర్శి ఎస్ సుదీప్తి ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దుకాణదారులను కలసి సింగల్ యూజ్ క్యారీ ప్యాక్ లు వాడొద్దని అవగాహన కల్పించారు. కొనుగోలుదారులకు గుడ్డ సంచులు తెచ్చుకునేలా దుకాణదారులు చెప్పాలన్నారు. వాడేసిన క్యారీ ప్యాక్ లను డ్రైనేజీలలో వేయవద్దని, రానున్నది వర్షాకాలం కనుక మురుగు నీటితో డ్రైనేజీలు నిండిపోయి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములుగా కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి ఉండి ముత్యాలు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.










