అంతరాష్ట్ర దొంగ అరెస్టు - రూ.11.5 లక్షల విలువ చేసే - బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
- రూ.11.5 లక్షల విలువ చేసే - బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఇటీవల పంజాణి పోలీసుస్టేషన్ పరిధిలో పొలాల దగ్గర ఉన్న ఇంటిలో జరిగిన భారీ దొంగతనం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో పలమనేరు రూరల్ సిఐ అశోక్ కుమార్ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గత 2నెలల నుండి ఈ కేసు గురించి దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో తిరిగి నేరస్తులకు సంబంధించిన సమాచారం సేకరించడం జరిగింది. ఈక్రమంలో గురువారం ఉదయం 9గంటలకు పోలీసులకు అందిన కచ్చితమైన సమాచారం మేరకు పలమనేరు రూరల్ సిఐ ఆద్వర్యంలో పోలీసుసిబ్బంది పంజాణి మండలం, పలమనేరు - మదనపల్లి రోడ్డులోని, కళ్లుపల్లి క్రాస్ వద్ద ముద్దాయి కె.మురుగన్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండున్న కేజీల వెండి, మొత్తం రూ.11,50,000లక్షల విలువ చేసే క్రైం ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. మురగన్ గత రెండు సంవత్సరాల నుండి దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోని పొలాల వద్ద ఒంటరి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడి భారీ మొత్తాలను దోచుకుంటూ జల్సా చేస్తూ పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇతనిపై సుమారు నాలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 40 కేసులు నమోదై పెండింగ్‌లో ఉన్నాయి. సదరు ముద్దాయి చిత్తూరు జిల్లాలోని రాళ్ళబుదుగురు, బంగారుపాళ్యం, జీడి.నెల్లూరు, పలమనేరు, కుప్పం పోలీసుస్టేషన్ పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన్నట్లు జిల్లా ఎస్‌పి రిషాంత్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. తమళనాడు రాష్ట్రం కళ్ళకురుచి తాలూకా తిమ్మలై గ్రామానికి చెందిన మురుగ (37) అంతరాష్ట్ర నేరస్తుడు ఇతడిపై చిత్తూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులున్నట్లు ఎస్‌పి తెలిపారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నేరస్తుడిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను అభిందిస్తూ కాష్ రివార్డులను జిల్లా ఎస్పీ అందజేశారు.










