ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ప్రస్తుతం వర్షాలు ఒక మోస్తరుగా కురిశాయి. వాతావరణంలో అనుకోని మార్పులు వచ్చాయి. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంది. ఉదయం మంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. దీంతో చిన్నపిల్లలు , వఅద్ధులు బయట ఎక్కువగా ఉండకుండా ఇంట్లోనే ఉండటం మంచిది అని డాక్టర్ సురేఖ సూచించారు. బుధవారం ప్రజాశక్తితో పచ్చికాపల్లం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సురేఖ మాట్లాడుతూ .... చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలం, పచ్ఛికాపల్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సురేఖ ప్రజల ఆరోగ్యం పై ఆమె జాగ్రత్తలను సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్ళేటప్పుడు చెవులు, ముక్కును కవర్ చేసేటట్టు గుడ్డను ముఖానికి చుట్టుకోవాలని, కాచి చల్లార్చిన నీళ్ళని తాగాలని చెప్పారు. బయటకు వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు పెద్దలు సోపుతో, డెటాల్ తో చేతులను శుభ్రం చేసుకోవాలని అన్నారు. పిల్లలకు గవర్నమెంట్ ఆసుపత్రివారు నిర్దేశించిన ప్రకారం వాక్సినేషన్ వేసుకోవాలన్నారు. జ్వరం, దగ్గు ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి, డాక్టర్‌ను సంప్రదించి, రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వారానికి ఒకసారి బ్లీచింగ్ చల్లాలని చెప్పారు. రాత్రి నిద్ర పోయేటప్పుడు వీలైతే దోమ తెర వాడాలని, టీబీ పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. పై జాగ్రత్తలు తీసుకుంటే వేసవికాలంలో ఆరోగ్యంగా జీవితం సాగించవచ్చునని డాక్టర్ సురేఖ తెలిపారు.










